పరువు హత్య తీవ్ర కలకలం

పరువు హత్య తీవ్ర కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని అల్లుడిని దారుణంగా మట్టు బెట్టించాడు. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రామచంద్రయ్య గౌడ్‌ కుమారుడు ఎరుకల రామకృష్ణ 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అప్పట్లో యాద గిరిగుట్టలోనే ఉంటూ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చి పోతుండేవాడు.

ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, వెంకటేశం కొద్ది రోజులకే వీరి ప్రేమ విషయం తెలుసుకుని రామకృష్ణను దూరం పెట్టాడు. ఇదే క్రమంలో 2019లో తుర్కపల్లిలో గుప్తనిధుల కేసులో రామకృష్ణను విధుల నుంచి తొలగించారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో రామకృష్ణను వెంకటేశమే గుప్తనిధుల కేసులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అప్పటి నుంచి రామకృష్ణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు.