టీడీపీలో ఉన్నప్పుడు నిత్యం హడావుడి చేస్తూ వార్తల్లో నిలిచిన ఆ పార్టీ నేత సాధినేని యామిని కొద్దిరోజుల కిందట టీడీపీని వీడిని సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. బ్రాహ్మణులు ఇబ్బందులు, అవమానాలు పడుతున్నారని.. బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్యసాయిశర్మతో కలిసి మహిళా విభాగం అధ్యక్షురాలి హోదాలో యామిని శర్మ గవర్నరును కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు ఒక లేఖ ఇచ్చారు. అందులో… రాష్ట్రంలో బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందుల రీత్యా బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని కోరారు.
దీనిపై ప్రభుత్వంతో చర్చించాలని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకుని వచ్చేందుకు క రాష్ట్ర బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్యసాయిశర్మ, మహిళా అధ్యక్షురాలు యామినిశర్మ విజ్ఞప్తిచేశారు. విజయవాడలో రాజ్‌భవన్ వద్ద గవర్నర్ విశ్వభూషణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడే తన దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ చెప్పినట్లు యామినీ శర్మ చెబుతున్నారు. కాగా.. కొద్దిరోజులుగా రాజకీయంగా సైలెంటుగా ఉన్న ఆమె ప్రధాన స్రవంతి రాజకీయాలకు సంబంధం లేకుండా కుల అంశంపై గవర్నరును కలవడం చర్చనీయమవుతోంది. ఆమె తదుపరి వేయబోయే అడుగుకు ఇది ఏమైనా ప్రారంభం కావొచ్చన్న అంచనాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.