Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుంటూరు జిల్లా పల్నాడు రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకుంటున్నాయి. నేతలు తమ వారసులని కొత్త నియోజకవర్గాల నుంచి తెర మీదకు తేవాలి అనుకుంటున్నారు. దీంతో పల్నాడు పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. పల్నాడు రాజకీయాల్ని కొన్ని దశాబ్దాల పాటు శాసించిన కాసు కుటుంబ వారసుడు మహేష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ సొంతగడ్డ నరసరావుపేట నుంచి పోటీ చేయడం లేదన్నది తెలిసిందే. పల్నాడు రాజకీయాల్లో యరపతినేని ప్రాభవానికి గండి కొట్టాలంటే ఆయన సొంత నియోజకవర్గం గురజాలలో గట్టి పోటీ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ భావించారు. అందుకే కాసు మహేష్ ని వైసీపీ లోకి తీసుకుని ఎవరూ ఊహించని విధంగా గురజాల బాధ్యతలు అప్పగించారు. దీంతో యరపతినేనిని ఢీకొట్టడానికి మహేష్ గురజాల నియోజకవర్గంలోనే ఎక్కువగా గడుపుతున్నారు. మహేష్ స్పీడ్ కి తగ్గట్టు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సైతం ఎప్పటినుంచో జనాల్లో తిరుగుతూ ముందుగానే ఎన్నికల వేడి రగులుస్తున్నారు. పెద్దోళ్ళకి షష్టిపూర్తి , గర్భిణీ లకి సీమంతాలు సొంత ఖర్చుతో చేస్తూ సరికొత్త ఒరవడి తెచ్చారు.
యరపతినేని తన గురజాల నియోజకవర్గం మీద దృష్టి పెడుతూనే పక్కనున్న మాచర్ల మీద కన్నేశారు. ఆయన మాచర్ల పోవడానికి మాత్రం కాదండోయ్. పెద్ద కొడుకు మహేష్ బాబు ని మాచర్ల నుంచి పోటీ చేయించాలని యరపతినేని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం మాచర్ల లో గట్టి పట్టున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని ఎలా ఢీకొట్టాలి అన్న దానిపై కొడుక్కి ట్రైనింగ్ ఇస్తున్నాడట. ఓ వైపు తాను కాసు మహేష్ అనే యంగ్ లీడర్ ని ఢీకొడుతూ, ఇంకో వైపు తన కొడుకు యరపతినేని మహేష్ ని పిన్నెల్లి మీద పోటీకి రెడీ చేస్తున్న శ్రీనివాసరావు రాజకీయం గురించే ఇప్పుడు పల్నాడు లో పెద్ద చర్చ . 2024 ఎన్నికల నాటికి చిన్న కొడుకు సాయి నిఖిల్ ని గురజాల నుంచి పోటీ చేయిస్తారేమో అన్న ప్రచారం కూడా సాగుతోంది.