రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈచిత్రంలో హీరోయిన్స్ ఎవరు, విలన్‌గా ఎవరు నటించబోతున్నారు, ఐటెం సాంగ్‌ను ఎవరు చేస్తారంటూ రకరకా వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలున్న నేపథ్యంలో ఆర్ మల్టీస్టారర్ చిత్రంలో విలన్‌గా నటించేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. జక్కన్న మూవీలో హీరోల స్థాయిలో విలన్ పాత్రలకు క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ మల్టీస్టారర్‌లో హీరోనే విలన్ పాత్ర చేసే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా కన్నడ హీరో యష్ ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎంపిక అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
యష్ త్వరలో తెలుగులో ‘కేజీఎఫ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న కారణంగా తెలుగులో యష్ కు మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే యష్‌ను ఈ మల్టీస్టారర్‌లో అనుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా యష్ ఆ వార్తలను కొట్టి పారేశాడు. తనను మల్టీస్టారర్ కోసం ఎవరు సంప్రదించలేదు అన్నాడు. ఒక వేళ నాకు కనుక ఆ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అన్నాడు. రాజమౌళి వంటి గొప్ప దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎవరైనా అనుకుంటారు అంటూ యష్ చెప్పుకొచ్చాడు. యష్ పుకార్లపై క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ జక్కన్న మల్టీస్టారర్‌లో విలన్ ఎవరా అనే చర్చ జరుగుతోంది.