యాత్ర రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

Yatra Movie Review & Rating

దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని మహి వి. రాఘవ్ ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించారు. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. విజయమ్మ పాత్రలో నటి, నాట్యమణి ఆశ్రిత వేముగంటి కనిపించారు. జగపతిబాబు, అనసూయ, రావు రమేశ్, సుహాసిని, సచిన్ ఖేదేకర్ ముఖ్య పాత్రలు పోషించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి, ఆయన ముఖ్యమంత్రి కావడానికి దోహదపడిందనే భావన చాలా మందిలో ఉంది. అయితే ఆ పాదయాత్రకు రాజశేఖర్ రెడ్డి పూనుకోవడానికి గల కారణాలు, పాదయాత్రలో భాగంగా రాజన్నకు ఎదురైన అనుభవాలు, ఆయనకు ప్రజలు ఏ విధంగా నీరాజనం పట్టారు వంటి అంశాలను దర్శకుడు ఈ చిత్రంలో చూపించారు. రాయలసీమకు చెందిన ఈ మహానేత రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏ విధంగా సంపాదించారో తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రం టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండి వై.ఎస్.ఆర్ అభిమానుల్లోనే కాక సాధారణ ప్ర‌జ‌ల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెల‌కొంది. దీనికి కార‌ణం ఓ మ‌హానేత చ‌రిత్రను తెర‌కెక్కిస్తుండటమే. సరిగ్గా ఎన్నికల ముందు వైఎస్ బయోపిక్‌ను విడుదల చేస్తున్నారంటే.. ఇది ఎన్నికల స్టంటా లేక ఈ చిత్రం ఇప్ప‌ుడు తీయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏమిటి? అధికార పార్టీని ఈ సినిమా ద్వారా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? లాంటి రకరకాల సందేహాలు, అనుమానాలు సినీ రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయమయ్యాయి. మరి ఈరోజు రిలీజ్ అయిన యాత్ర ఏమి చేసిందో చూద్దాం

కథ ఏంటంటే..
దర్శకుడు ముందుగా చెప్పినట్టే వైఎస్ఆర్ బయోపిక్ మూవీని కీలకమైన పాదయాత్ర నేపథ్యంలోనే ఎమోషనల్ డ్రామా‌గా రూపొందించారు. 2009 ఎన్నికలకు వైఎస్ఆర్ ఎలా సన్నద్ధమయ్యారు? అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్‌కి అధికార పార్టీ నుండే కాకుండా సొంత పార్టీ నుండి ఎదురైన ఇబ్బందులు ఏంటి? రాజకీయాలను వదిలేద్దామనే నిర్ణయానికి వైఎస్ ఎందుకు వచ్చారు? ఆయన పాదయాత్ర చేపట్టడం వెనుక కారణాలు ఏంటి? ఉచిత విద్యుత్, ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, వృద్దాప్య ఫించన్లు తదితర సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం ద్వారా ఆయన తిరిగి ఎలా ముఖ్యమంత్రి కాగలిగారు? ఈ ప్రశ్నలకు సమాధానంగా ‘యాత్ర’ సినిమాను ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు.
నటీనటులు :
ఒక సినిమాకి కథ ఎంపికతోపాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా సినిమా సక్సెస్ నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే వైఎస్ పాత్రకు మలయాళ నటదిగ్గజం మమ్ముట్టిని ఎంపిక చేయటంతోనే ఈ సినిమా సగం సక్సెస్ సాధించింది. మూడు నేషనల్ అవార్డ్స్, ఆరు స్టేట్ అవార్డ్స్, 12 ఫిల్మ్ ఫేర్‌లు, రెండు డాక్టరేట్‌లు.. పద్మశ్రీ మమ్ముట్టిని నట దిగ్గజం అనడానికి ఈ అవార్డులే నిదర్శనం. నిజానికి ‘యాత్ర’ సినిమా ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో పెద్దగా కథ ఉండదు. పాత్రలే కథకు ప్రాణం. వైఎస్ఆర్‌గా లీడ్ రోల్ పోషించిన మమ్ముట్టి పాత్ర కోసం ప్రాణం పెట్టడం ఏంటో ఆయన నటన ద్వారా నిరూపితం చేశారు. వైఎస్ పాత్రలో ఒదిగిపోయారు. జాలి, ప్రేమ, కరుణ, దయ, పొగరు, లాంటి ఎమోషన్స్ పలికించడమే కాకుండా కొన్ని ఎమోషన్ సీన్లలో కళ్లతో నిర్ణయం చేయడం ఎలాగో చూపించారు.
సాంకేతిక వర్గం :
ఇక ఈ కథను డీల్ చేసిన విధానంతో దర్శకుడు మహి వి రాఘవకి ప్రశంసలు దక్కుతాయి. టైటిల్స్‌లోనే వైఎస్ బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ ఎంట్రీ, ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును చెప్పేసిన దర్శకుడు కేవలం పాదయాత్రను మాత్రమే మెయిన్ థీమ్‌ గా ఎన్నుకుని పెద్ద ప్రయోగమే చేశారు. అయితే ఫస్టాఫ్ మొత్తం సాఫీగా నడిపిన దర్శకుడు సెకండాఫ్‌లో బలమైన సీన్లను రాసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ ప్రవేశ పెట్టిన ఒక్కో సంక్షేమ పథకానికి ఒక్కో బలమైన కారణాన్ని చాలా ఎమోషనల్ చూపించారు. ముఖ్యంగా పాత్రల ఎంపిక ద్వారా దర్శకుడు సక్సెస్ అయ్యారు. వైఎస్ పాత్రకు మమ్మట్టిని… విజయమ్మ పాత్రకు అశ్రితను.. కేవీపీ పాత్రకు రావు రమేష్‌ని.. రాజారెడ్డి పాత్రకు జగపతిబాబుని.. సబితా ఇంద్రారెడ్డి పాత్రకు సుహాసినిని తదితర పాత్రల ఎంపికతో ఆయా పాత్రలకు జీవం పోసేలే బలమైన సీన్లు రాశారు దర్శకుడు. ఒకరితో ఒకరు పోటీపడి నటించి యాత్ర ద్వారా ఎమోషనల్ జర్నీ అందించారు.
టెక్నికల్ పరంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి తక్కువ బడ్జెట్‌ లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. సినిమాను చాలా రిచ్‌గా ఉంది. ఈ విషయంలో సినిమాటోగ్రాఫర్ సత్యం సూర్యన్‌ను ప్రశంసలు దక్కుతాయి. ఇక కథానుగుణంగా వచ్చే పాటలు ‘యాత్ర’ సినిమాకు హెల్ప్ అయ్యాయి. కె. అద్భుతమైన స్వరాలను అందించారు. సిరివెన్నెల రాసిన పాటలు ఆకట్టుకున్నాయి. చివర్లో పెంచల్ దాస్ రాసి, పాడిన ‘మరుగైనావా రాజన్నా’ సాంగ్ ఎమోషనల్‌గా బరువెక్కిన గుండెలతో థియేటర్స్ బయటకు వచ్చేలా చేసింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ బాగుంది.
తెలుగు బులెట్ పంచ్ లైన్ : సూటిగా సుత్తి లేకుండా సాగిన యాత్ర
తెలుగు బుల్లెట్ రేటింగ్ : ఇది తెలుగు ప్రజలందరి మీద తనదైన ముద్ర వేసుకున్న నేత జీవితానికి సంబందించిన సినిమా కాబట్టి దీనికి రేటింగ్ ఇవ్వబోడవడం లేదు.