కన్నడ కలలకం…ఐదుగురు ఎమ్మెల్యేలు అదృశ్యం !

Political Instability In Karnataka

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతోంది. ఎమ్మెల్యేల ని కొనుగోలు చేయటానికి బీజేపీ బేరసారాలు మొదలుపెట్టింది. అందుకే ఈ సందర్భంగా జేడీఎస్‌, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశాయి. కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, అసంతృప్తులకు బీజేపీ గాలయం వేస్తోందని ఆరోపణలతో రెండు పార్టీల పెద్దలు అప్రమత్తమయ్యారు. సమావేశాలకు ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాలని విప్‌ జారీ చేశారు. ఏ ఒక్కరు రాకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు.

ఈ విషయాన్ని కుమారస్వామి ధ్రువీకరించారు. కర్ణాటకలో గత ఏడాది కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో తొలుత అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. గవర్నర్‌ అవకాశమివ్వడంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే శాసనసభలో ఆయన బలనిరూపణ చేసుకోలేకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆపరేషన్‌ కమల పేరుతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను భాజపా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి తాజాగా ఆడియో టేపును విడుదల చేయటం రాజకీయంగా దుమారాన్ని లేపింది.