ఏనుగు తెచ్చిన తంటా !

Supreme Court Gave Shock To Mayawati

బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె హయాంలో ఏనుగు విగ్రహాల నిర్మాణానికి ఉపయోగించిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నో, నొయిడాతో పాటు యూపీలో పలు చోట్ల స్మారక మందిరాలను మాయావతి నిర్మించారు. వాటిలో భారీ ఏనుగు విగ్రహాలతో పాటు పలు పార్కులను కూడా నిర్మించారు. వీటి కోసం రూ. 2600 కోట్లు ఖర్చు అయ్యింది అందుకే ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ మాయావతి తన విగ్రహాలు ఏర్పాటు చేయించుకున్నారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తన పార్టీ ప్రచారం కోసం మాయావతి ప్రజాధనాన్ని ఉపయోగించుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈరోజు పిటిషన్‌ పై విచారణ జరిగింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.‘ప్రజాధనాన్ని ఉపయోగించి మాయావతి తన విగ్రహాలు, పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు గాను ఆమె రాష్ట్ర ఖజానాలో ఈ సొమ్మును జమ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు అయితే ఇది తాత్కాలిక అభిప్రాయం మాత్రమేనని దీనిపై పూర్తి స్థాయిలో వాదనలు వినాల్సి ఉంది’ అని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 2 కి వాయిదా వేసింది.