పోలవరంపై సుప్రీంలో కేంద్రానికి చుక్కెదురు

Polavaram is in the Supreme Court
Polavaram is in the Supreme Court

పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వాదనలు సంబంధిత రాష్ట్ర హైకోర్టులోనే వినిపించాలని సూచించింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దాని నిర్మాణ వ్యయం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలంటూ మాజీ ఎంపీ కేవీపీ రామచం ద్రరావు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం 2019లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుటకు సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషన్ను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. పోలవరంపై ఇతర పిటిషన్లు ఏపీ హైకోర్టులో ఉన్నాయని కేవీపీ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ దశలో జోక్యంచేసుకున్న ధర్మాసనం ఏపీ హైకోర్టులో ఇందుకు సంబంధించిన ఇతర పిటిషన్లు ఉన్నప్పుడు ఈ వ్యాజ్యం దిల్లీ హైకోర్టులో ఎందుకు అని ప్రశ్నించింది. ఆ రాష్ట్ర హైకోర్టులోనే వాదనలు వినిపించుకోవాలని సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.