Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సీఎం పీఠం కోసం నాడు సోనియా గాంధీని ఢీకొట్టి కొత్త పార్టీ పెట్టడానికి ఏ మాత్రం భయపడని జగన్ నేడు పీఎం మోడీ ప్రాపకం కోసం వంద మెట్లు దిగి మరీ రాజకీయం చేస్తున్నారు. ఇక పీఎం మోడీ కి అందండ అంటూ ఎన్నికల ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ టార్గెట్ చేసి ఎన్ని విమర్శలు చేశారో చూసాం. ఈ ఇద్దరు యువనేతలు ప్రజాకర్షణలో ఎవరికి వారే సాటి. అందుకే రాజకీయంగా ఈ రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడబోవని అందరూ భావించారు. దానికి తగ్గట్టే సీఎం చంద్రబాబుతో పవన్ మెతక వైఖరి, పవన్ పద్ధతుల మీద వైసీపీ నేతల కరకు వ్యాఖ్యలు వుంటూ వచ్చాయి. ఈ సీన్ లో చేంజ్ వచ్చే అవకాశం ఉందా ?. ఈ ప్రశ్నకి ఎస్ అని చెప్పలేకపోయినా నో అని కూడా అనలేని పరిస్థితులు ఇప్పుడిప్పుడే కలుగుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఎంత ఉదారంగా ఉంటున్నారో ఇంకో సారి అర్ధం అయ్యింది. పవన్ మీద పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మంత్రి అశోక గజపత్జి రాజు, రాష్ట్ర మంత్రి పితాని వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా కలగజేసుకుని సంయమనం పాటించమని చెప్పడం చూసాం. అదే విధంగా జనసేనకు కూడా పవన్ తొందరపాటు వద్దని హితవు చెప్పారు. రెండు వైపులా శాంతి మంత్రం జపించినట్టే అనుకుంటున్న సమయంలో జనసేన మీడియా వ్యవహారాలు చూస్తున్న హరి ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశంలో అవసరం అయితే ఏ పార్టీ తో అయినా కలిసి పని చేయడానికి జనసేన సిద్ధం అని ఆయన ప్రకటించారు. ఎప్పుడో మూలనపడ్డ ఈ అంశం మీద జనసేన ఇంకా దృష్టి పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతకన్నా ఆశ్చర్యకరం ఏమిటంటే బీజేపీ ప్రాపకం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ నోట మళ్లీ ప్రత్యేక హోదా మాట వినపడుతోంది. ఈ డిమాండ్ తో జగన్ మరోసారి యువభేరీ కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ప్రత్యేక హోదా అంశం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు పార్టీలు ఒకే మాట మాట్లాడడం చూస్తుంటే ఇదే అజెండా తో కొత్త రాజకీయ సమీకరణాలు వర్కౌట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అనిపిస్తోంది.