బాబుకు వినపడేలా టపాసుల మోత మోగిస్తున్న వైసీపీ శ్రేణులు !

YCP cadre in full swing celebrationg thier success

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, మరోసారి రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పలుమార్లు చేసిన విజ్ఞప్తితో ఆ ఫలితం ఓట్ల రూపంలో వెల్లువై పారుతోంది. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఊపందుకోగా, పలు నియోజకవర్గాల్లో ఐదు నుంచి ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన ట్రెండ్స్ వెలువడుతుండగా, వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి, తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా, తెలుగుదేశం పార్టీ కేవలం 24 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక చోట కాంగ్రెస్ సహా మరే ఇతర పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. పవన్ కల్యాణ్ భీమవరంలో మూడో స్థానంలో, గాజువాకలో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ పలు జిల్లాలను క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నెల్లూరు, కడప, విజయనగరం, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. అధికార మార్పిడిని ప్రజలు స్పష్టంగా కోరుకున్నారని ఈ ఎన్నికల ఫలితాల సరళి తెలియజేస్తుండగా, మరోసారి రాజన్న రాజ్యం రానుందని వైసీపీ శ్రేణులు సంబరాల్లో ఉన్నాయి. గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఇక్కడికి పెద్దఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టబోయేది జగన్ నేతృత్వంలోని తమపార్టీయేనన్న అంచనాకు వచ్చేసిన కార్యకర్తలు, వైసీపీ కేంద్ర కార్యాలయానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు నివాసానికి వినిపించేలా బాణసంచా పేలుళ్లతో దడదడలాడిస్తున్నారు. ఉండవల్లిలో జగన్, చంద్రబాబు నివాసాల మధ్య ఎయిర్ డిస్టెన్స్ కిలోమీటర్ కూడా లేకపోవడంతో వైసీపీ శ్రేణులు కాలుస్తున్న బాణసంచా కాంతులు ప్రజా వేదిక వరకూ కనిపిస్తుండటం గమనార్హం.