ఇసుక మాఫియాలో వైసిపి నేతలు

ఇసుక మాఫియాలో వైసిపి నేతలు

ఇసుక మాఫియాలో వైసిపి నేతల పేర్లను తెలుగుదేశంపార్టీ నేతలు విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణలోనే నేతలు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి జనాలను దోచేసుకుంటున్నట్లు టిడిపి నేతలు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇసుకను దోచేసుకుంటున్న వారి జాబితా అంటూ 67 మంది పేర్లతో మంత్రులు, ఎంఎల్ఏలు, వారి అనుచరులు ఉన్నట్లు ఆరోపించారు.

టిడిపి హయాంలో పేరుకు మాత్రమే ఇసుక ఉచితం. కానీ వాస్తవంలో మాత్రం వేలాది రూపాయలు తీసుకునే ఇసుక సరఫరా జరిగింది. అందుకనే చాలామంది తమ్ముళ్ళు చాలా తక్కువ కాలంలోనే కుభేరులైపోయారు. ఈ విషయాన్ని ఎల్లోమీడియాలోనే కాకుండా టిడిపిలోనే వర్గాలే బాహాటంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎల్లోమీడియాలోని ఓ పత్రిక అయితే ఏ ఏ నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది , ఎక్కడెక్కడికి వెళుతోంది , అనే అంశాలపై మ్యాపులతో సహా ప్రచురించింది.

టిడిపి హయాంలో ఇసుక అక్రమరవాణా జరుగుతోందంటే ప్రతిపక్ష నేతలకు అయితే అవకాశాలు ఉండవు కదా నిజంగానే ప్రతిపక్షాలు గనుక అక్రమ రవాణాలో భాగస్వాములై ఉంటే వెంటనే ప్రభుత్వ యంత్రాంగం చూస్తు ఊరుకుంటుందా  కాబట్టి అప్పట్లో ఎల్లోమీడియాలో వచ్చిందంతా కేవలం తమ్ముళ్ళ గురించి మాత్రమే అని అర్ధమైపోయింది.

ఇక టిడిపి విడుదలచేసిన జాబితాను చూస్తు వైసిపిలో ఎంపిక చేసిన వారి పేర్లను, వారి బంధులు, అనుచరుల పేర్లను చేర్చినట్లుంది. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ ఎంఎల్ఏ కళావతితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కొడుకు చిరంజీవి కూడా ఉండటం గమనార్హం. టిడిపి హయాంలో దివంగత నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సంతానం గబ్బుపట్టేసింది కాబట్టి ఇపుడు సీతారామ్ కొడుకును పిక్చర్లోకి లాగుతున్నట్లే ఉంది.

ఇక మంత్రులు బొత్సా సత్యనారాయణ, తానేటి వనిత, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, డిప్యుటి స్పీకర్ కోన రఘుపతి, మేకపాటి గౌతమ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్, శంకరనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎంఎల్ఏలు, ఎంపి పేర్లను కూడా జాబితాలో చేర్చారు. ప్రకాశం, కడప జిల్లాల్లోని మంత్రుల పేర్లు లేకపోవటమే విచిత్రంగా ఉంది.