విమర్శకి పేటెంట్ హక్కు వైసీపీదే.

YCP Took Patent Righst for Controversies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రజా జీవితంలో వున్న ఎవరికైనా జనం ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాల మీద స్పందించే అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ పార్టీ నడుపుతుంటే ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకోరు. కానీ ఈ విషయాన్ని ఆంధ్రాలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ ఒప్పుకునేట్టు లేదు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఓ దళిత మహిళ పట్ల అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, ఆమెని వివస్త్రను చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే తాను నేరుగా రంగంలోకి దిగి పోరాడేందుకు సిద్ధం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుబట్టాల్సి వస్తే అధికార పక్షం పవన్ ని తప్పుబట్టాలి. కానీ చిత్రంగా వైసీపీ ముందుకు వచ్చింది. పైగా ఆ పార్టీ వాదన వింటే ఆశ్చర్యం కూడా కలుగుతోంది.

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజా పెందుర్తి ఘటన మీద పవన్ కామెంట్స్ ని తప్పుబట్టింది. ఈ విషయంలో పవన్ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వెనుక కుట్ర ఉందట. ఘటన జరిగిన మూడు రోజుల దాకా స్పందించని పవన్ ఆపై సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టడానికి పెందుర్తి ఘటన క్రెడిట్ వైసీపీ కి పోతుందన్న భయంతోనట. రోజా ఎంత తెలివిగా మాట్లాడినా పెందుర్తి ఘటనని రాజకీయ లబ్ది కి వాడుకుంటున్నట్టు చెప్పకనే చెప్పారు. అన్యాయం జరిగిన దళిత మహిళకు న్యాయం చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానించాల్సింది పోయి, ప్రభుత్వాన్ని తిట్టే, విమర్శించే హక్కు మాకు మాత్రమే ఉందనుకుంటే అంతకు మించిన దారుణం ఏముంటుంది. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలి అనుకుంటున్న వైసీపీ ధోరణి ప్రజలకు నచ్చడం లేదని ఎన్నో సందర్భాల్లో రుజువు అయినా ఆ పార్టీ నేతలు కళ్ళు తెరవడం లేదు. విమర్శకు వైసీపీదే పేటెంట్ హక్కు అన్నట్టు మాట్లాడుతున్నారు.