ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. మంగళవారం విజయసాయిరెడ్డి కేంద్ర వాణిజ్యశాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్టాండింగ్ కమిటీల్లో అత్యంత కీలకమైన వాణిజ్యశాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి విజయసాయిరెడ్డిని నియమించింది. ఈ కమిటీలో 31మంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సభ్యులుగా ఉంటారు.
బాధ్యతలు స్వీకరించిన విజయసాయిరెడ్డి మంగళవారం పార్లమెంట్ హౌస్ లో వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. వాణిజ్యశాఖకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులు ఈ కమిటీ పరిశీలించింది. వస్త్రాలతోపాటు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖలకు సంబంధించిన వివిధ పెండింగ్ బిల్లుల గురించి విజయసాయిరెడ్డికి – కమిటీ సభ్యులకు అధికారులు వివరించినట్టు తెలిసింది. వాణిజ్యశాఖకు సంబంధించిన వార్షిక నివేదికలను కమిటీ క్లూప్తంగా పరిశీలించింది.
పారిశ్రామిక విధానంతోపాటు వాణిజ్యశాఖకు చెందిన బిల్లులు – పరిశ్రమల అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విజయసాయిరెడ్డి సమావేశంలో వివరించారు.