Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నికల ముందు ప్రకటించినట్టుగానే ఈరోజు కర్ణాటక 23వ సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. “బీఎస్ యడ్యూరప్ప అనే నేను…” అంటూ మొదలయిన ప్రమాణ స్వీకారం ఆద్యంతం కన్నడంలో సాగింది. ప్రమాణ స్వీకారానికి ముందు రాధాకృష్ణ ఆలయంలో యడ్యూరప్ప పూజలు చేశారు. కర్ణాటక సీఎంగా మూడోసారి యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినట్టు అయ్యింది. నిన్న బీజేఎల్పీనేతగా యడ్యూరప్పను ఎన్నుకున్న తరువాత అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజుభాయ్వాల్ బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అర్ధరాత్రి హైడ్రామా తరువాత యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది.
గవర్నర్ నిర్ణయాధికారంలో జోక్యం చేసుకోబోమని కోర్టు తేల్చిచెప్పడంతో గురువారం ఉదయం సరిగ్గా 9 గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దగా హంగు, ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం ముగిసిందని చెప్పాలి. ప్రస్తుతం యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయగా గవర్నర్ ముందు బలనిరూపణ తర్వాతే కేబినెట్‌ను విస్తరణ జరుగనుంది. 15రోజుల్లో యడ్యూరప్ప సర్కార్ బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ శ్రేణులు యడ్యూరప్పకు, బీజేపీకి జయజయధ్వానాలు పలికాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రకాష్ జావదేకర్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారమహోత్సవంలో పెద్దఎత్తున కార్యకర్తలు, జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.