Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ విజుభాయ్ రుడాభాయ్ వాలాను జేడీఎస్ నేత కుమారస్వామి, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ సంయుక్తంగా కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం తమకు ఉందని గవర్నర్‌కి తెలిపారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు గవర్నర్‌కు లేఖ సమర్పించారు. ముందుగా 118 మంది ఎమ్మెల్యేలను తీసుకొని గవర్నర్ వాజుభాయ్ ను కలిసేందుకు కుమారస్వామి రాజ్ భవన్ కు చేరుకున్నారు. తనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కుమారస్వామి గవర్నర్ ను కోరారు. ప్రత్యేక ఏసీ బస్సుల్లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి చెందిన 118 మంది ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు చేరుకున్నారు. అయితే తనను కలిసేందుకు కాంగ్రెస్ జేడీఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గవర్నర్ అనుమతించినట్లు తెలుస్తోంది. సర్కార్ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే లక్ష మందితో రాజ్‌భవన్ వద్దే ధర్నాకు దిగుతామని హెచ్చరించడంతో ఒక్కసారిగా రాజ్‌భవన్ వెలుపల ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
తమ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా కూడా జేడీఎస్-కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించారు. దీంతో రాజ్‌భవన్ వద్ద భారీఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మరో కొద్ది సేపటిలో యడ్యూరప్ప కూడా గవర్నర్ ని కలవనున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని ఇరు వర్గాల్లో ఎవరినైనా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవవచ్చు. లార్జెస్ట్ సింగిల్ పార్టీగా నిలిచిన బీజేపీకి అయినా అవకాశం ఇవ్వవచ్చు, లేదా కూటమిగా వస్తామంటున్న కాంగ్రెస్ -జేడీఎస్‌లకు కూడా అవకాశం ఇవ్వవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. మామోలుగా అయితే బీజేపీనే పిలవాల్సి ఉంటుంది కానీ గత ఎన్నికల పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ ని పిలిచే అవకాశం ఉన్నా గవర్నర్ మోడీకి అత్యంత సన్నిహితుడు కావడంతో గవర్నర్ బీజేపీ వైపే మొగ్గు చూపుతారని తెలుస్తోంది. రేపే ప్రమాణస్వీకారం అని కూడా బీజేపీ నేతలు సైతం అంటున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ముహూర్తం ఖరారు అయ్యిందని, రేపు మధ్యాహ్నం 12.20కి కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.