Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా పొలాల్లో ల్యాండయింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఒక స్కూలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్ వద్ద దింపాల్సి ఉండగా, ఊహించని విధంగా సమస్యలు తలెత్తడంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా అక్కడికి సమీపంలోని పొలంలో దింపేశారు. ప్రిన్సిపల్ హోం సెక్రటరీ అరవింద్ కుమార్ లక్నోలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని ఆయన మీడియాకు తెలిపారు.
సహావర్ తాలూకా ఫరౌలి గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురికాగా, వారి కుటుంబాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు పరామర్శించాల్సి ఉంది. అలాగే, అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తో సమీక్ష కూడా నిర్వహించాలని అనుకున్నారు అందుకే ఫరౌలి గ్రామ సమీపంలోని కస్తూర్బా విద్యాలయంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే, కిలోమీటరు దూరంలో ఉండగానేే హెలికాప్టర్ లో కొన్ని సమస్యలు తలెత్తడంతో పైలట్ వెంటనే దాన్ని పొలాల్లో సురక్షితంగా దించేశారు. అనంతరం ముఖ్యమంత్రి యథావిధిగా షెడ్యూల్ ప్రకారం తన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. సిఎం కి క్షేమంగా బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.