మోసం చేసిన ప్రియురాలి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్య

young man suicide infront of lover house

నాలుగేళ్ల పాటు తనను ప్రేమించి, చెట్టాపట్టాలేసుకు తిరిగి, రహస్యంగా వివాహం కూడా చేసుకుని ఇప్పుడు పెళ్లిని కాదన్నదన్న అవమానంతో ఓ యువకుడు, తన ప్రియురాలి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. సమ్మక్క– సారలమ్మ తాడ్వాయి మండల పరిధిలో కాల్వపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం,  చల్వాయికి చెందిన జక్కుల మహేందర్‌ (25) అనే యువకుడు, కాల్వపల్లికి చెందిన ఓ యువతి గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు.  ఈ క్రమంలోనే వీరిద్దరు రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసింది. రెండు రోజుల క్రితం యువతిని ఇద్దరి కుటుంబాల పెద్దలు నిలదీయగా మహేందర్‌ తనను భయపెట్టి వివాహం చేసుకున్నాడని, అతనంటే తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేందర్‌ బుధవారం రాత్రి విష గుళికలు మింగి ప్రియురాలి ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును విచారిస్తున్నట్టు తెలిపారు.