భార్య మీద అనుమానం…ముగ్గురి దుర్మరణం

Doubt on wife

తన భార్య మరోవ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందని అనుమానించిన ఓ వ్యక్తి మరో ముగ్గురిని బలితీసుకున్నాడు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి కలకత్తాలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో నివాసముంటున్నాడు. అతని బంధువులు కూడా అక్కడే ఉంటున్నారు. అయితే, గత కొంతకాలంగా తన భార్య దగ్గరి బంధువైన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అతనికి అనుమానం మొదలైంది. 15 రోజుల క్రితం వారిద్దరూ కలిసి బయటకు వెళ్లడంతో ఈ అనుమానం మరింత బలపడింది. దీంతో భార్యతో చనువుగా ఉంటున్న వ్యక్తిని చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి సదరు వ్యక్తి ఇంటి గుమ్మం బయట విద్యుత్‌ సరఫరా ఉన్న వైర్‌ను ఉంచాడు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని వెలుపలకు రప్పించేందుకు బయట ఉన్న వారి బట్టలకు నిప్పుపెట్టాడు. మంటల్ని ఆర్పేందుకు ఇంట్లోని వారు ఒకరివెంట ఒకరు బయటికొచ్చారు. గుమ్మంలో ఉన్న విద్యుత్‌ వైర్‌ తగిలి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. మరో ఆరుగురు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పారిపోయేందుకు యత్నించిన నిందితున్ని రైల్వే స్టేషన్‌లో పట్టుకున్న గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.