జగన్ నోట నారాయణ మంత్రం

YS Jagan comments on AP Minister Narayana

త్రిలోక సంచారి నారద మహర్షి నోట వినిపించే నారాయణ మంత్రం గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్లకి కూడా పాత తెలుగు పౌరాణిక చిత్రాలు చూస్తే నారదుడు నిత్యం “ నారాయణ నారాయణ “ అంటూ ఉంటాడనే విషయం అర్ధం అవుతుంది. ఇప్పుడు పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతున్న వైసీపీ అధినేత జగన్ నోట కూడా అవే మాటలు వినిపిస్తున్నాయి. కాకపోతే నారదుడు లోకకల్యాణం కోసం నారాయణ మంత్రం పలికితే జగన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రత్యర్థి మీద పగ సాధించడం కోసం అదే జపం చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఎక్కడ ఏ సభ జరిగినా సీఎం చంద్రబాబుని ఏకిపారేసే జగన్ ఈ మధ్య ఆ కోటాలోకి మంత్రి నారాయణ ని కూడా చేర్చారు. పైగా నారాయణ మీద ఆరోపణలు మొత్తం ఆయన విద్యాసంస్థల్ని టార్గెట్ చేస్తూ సాగుతున్నాయి. నారాయణ విద్యాసంస్థలకు అనుమతులు,ఇతరత్రా అంశాల గురించి కూడా జగన్ ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మంత్రి నారాయణ మీద జగన్ ఈ స్థాయిలో దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి.

jagan and AP Ministar Narayana

నారాయణ విద్యాసంస్థలు సాధిస్తున్న విజయాలతో అందులో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చే ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా మాట్లాడకుండా నిలవరించాలంటే ముందుగా వారిలో ఎంతోకొంత అభద్రత కల్పించాలని జగన్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతకన్నా సంచలన అంశం ఇంకోటి వుంది. విద్యారంగంలో నారాయణతో పోటీ పడుతున్న ఓ సంస్థ కి తెలంగాణాలో ఓ రాజకీయ పార్టీ అండ మెండుగా ఉందట. ఆ సంస్థ ఎదుగులకి అవకాశం కల్పించడానికి వైసీపీ రెడీ అయినట్టు కనిపిస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పైగా విద్యాసంస్థల మీద ఆరోపణలు చేస్తే నారాయణ డిఫెన్స్ లో పడతారని కూడా జగన్ ఆలోచనగా ఉందట. పైగా తాను అధికారంలోకి వస్తే కార్పొరేట్ కళాశాలల పని పడతానని కూడా జగన్ హెచ్చరిస్తున్నారు. అయితే ఆ పని చేసే ముందు ప్రభుత్వ కాలేజీ లు బాగుపడేందుకు ఏదైనా ప్రణాళిక ఉందా అంటే ఆ ఊసే లేదు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చకుండా నారాయణ లేదా ఇంకో కార్పొరేట్ కాలేజీ ని ఎంత తిట్టినా ప్రయోజనం ఉండదు. గవర్నమెంట్ కాలేజీల ప్రమాణాలు పెరిగితే పిల్లలు , వారి తల్లిదండ్రులు తమకేది ఉపయోగమో దాన్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ దిశగా ప్రణాళిక లేకుండా నారాయణ మీద ఎంత బెదిరింపులకు దిగినా లాభం ఉండదు.