Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం తెలుసుకున్న బ్రాహ్మణ సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణా సంఘాల సమీకరణ జరిపి, ఆ ఆత్మీయ సమావేశానికి జగన్ ను ఆహ్వానించారు. ఏమైందో ఏమో కాని, ముందు వస్తాను అని చెప్పిన జగన్, తరువాత అటు పక్కకి కూడా చూడకుండా వెళ్ళిపోయారు. జగన్ వస్తారన్న వైసీపీ నేతల భరోసాతోనే సమావేశం కోసం ఏర్పాట్లు చేసుకున్నామని, అందు కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు తరలి వచ్చారని అయితే జగన్ మాత్రం హాజరు కాకుండా తన జాతిని అవమానపరిచారని బ్రాహ్మణ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
సభకు రాకుండా తమ మనోభావాలను జగన్ గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులకు జరిగిన ఈ అవమానంపై రాష్ట్ర నేతలంతా రాజమండ్రిలోని ఓ హోటల్లో అత్యవసర సమావేశం అయ్యారు. జగన్ అవమానించిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించకపోతే రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, వైసీపికి వ్యతిరేకంగా పనిచేస్తామని అన్నారు. జగన్‌తోపాటు వైసీపీ నేతలను బహిష్కరిస్తామని అన్నారు. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రంలో జగన్ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తామని బ్రాహ్మణ సంఘం నేతలు ప్రకటించారు.