ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడేది నేనొక్క‌డినేనా..?

YS jagan speech at Anantapur Yuvabheri about Ap Special Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనంత‌పురం యువ‌భేరీలో జ‌గ‌న్ వైసీపీ భ‌విష్య‌త్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. న‌వంబ‌ర్ 2 నుంచి పాద‌యాత్ర చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇడుపుల పాయ నుంచి చిత్తూరు మీద‌గా ఇచ్చాపురం దాకా యాత్ర సాగుతుంద‌ని తెలిపారు. ఆరు నెల‌ల్లో మూడు వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటాన‌న్నారు. ఇక‌నుంచి ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ వాడ‌వాడ‌లా పోరాటం చేస్తుంద‌ని వివ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్లు కాలేజీల‌కు వెళ్లి విద్యార్థుల‌ను క‌లుస్తార‌ని, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తునూ కూడ‌గ‌డ‌తారని తెలిపారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు చివ‌రి అస్త్రంగా ఎంపీలు రాజీనామా చేస్తార‌ని ప్ర‌క‌టించారు.

తాము ఉద్య‌మానికి విరామం ఇచ్చిన స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా గురించి ఎవ‌రైనా మాట్లాడారా అని ప్ర‌శ్నించిన జ‌గ‌న్… తాను మాట్లాడితేనే ప్ర‌త్యేక హోదా అనే పరిస్థితి మారాల‌ని, పాల‌కుల‌పై అంద‌రూ క‌లిసి ఒత్తిడి పెంచాల‌ని సూచించారు. అనంత‌పురం స‌మ‌స్య‌లనూ జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. అనంత‌పురం లాంటి జిల్లాల‌కు ప్ర‌త్యేక హోదా చాలా అవ‌స‌ర‌మ‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌స్థాన్ లోని జై స‌ల్మేర్ త‌ర్వాత దేశంలో అతి త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే జిల్లా అనంత‌పుర‌మే అని, జిల్లా ఎడారిగా మారుతుందేమోన‌న్న భ‌యం నెల‌కొంద‌ని, ప్ర‌త్యేక హోదా వ‌స్తే అనంత‌పురం స్వ‌రూప‌మే మారిపోయేద‌న్నారు. సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ, ఎయిమ్స్ కు అనుబంధ కేంద్రం, నూత‌న పారిశ్రామిక న‌గ‌రం, స్మార్ట్ సిటీ వంటి ఎన్నో హామీలు అనంత‌పురానికి ఇచ్చిన చంద్ర‌బాబు ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.