మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాడు చేసిన సిట్ విచారణ వేగవంతం చేసింది. వివేకా నివాసాన్ని న్ నిన్న పరిశీలించిన సిట్ బృందం ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివప్రకాష్‌రెడ్డిలను ప్రశ్నించారు. అలాగే, పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో వివేకా సోదరులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహరరెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, బావమరిది దేవిరెడ్డి శివశంకరరెడ్డిలను మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు విచారించారు. ఈ సందర్భంగా వైఎస్ ప్రతాప్‌రెడ్డి వివేకా హత్య కేసులో ఎవరిపైనా అనుమానాల్లేవని వ్యాఖ్యానించారు. వివేకా హత్యను సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న జగన్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ రాజకీయంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారని, వాటితో తమకు సంబంధం లేదని అన్నారు. సీబీఐ విచారణ కోరడం రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు కావొచ్చని, రాజకీయాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో మైనింగ్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో వివేకానందరెడ్డి తన ఇంటి ముందు ధర్నా చేసిన మాటా వాస్తవమేనని అయితే, దీనికి హత్యకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. అది మా వ్యక్తిగత వ్యవహారమని పేర్కొన్నారు. ఇక, వివేకా హత్య ఘటనలో పరమేశ్వరరెడ్డి అనే వ్యక్తి పాత్ర ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. సింహాద్రిపురం ప్రాంతానికి చెందిన ఆయన వివేకా హత్య తర్వాత నుంచి కనిపించట్లేదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.