షర్మిల కూడా తండ్రి బాటలోనే

షర్మిల కూడా తండ్రి బాటలోనే

పాదయాత్ర.. ఆ పేరు వింటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే. 2004 ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలనే సమూలంగా మార్చేసింది. కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చింది. ఆయన తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు పాదయాత్ర చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా తండ్రి బాటలోనే పయనించారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చారు.

ఇటీవల వైఎస్సార్‌టీపీతో తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన వైఎస్ తనయ వైఎస్ షర్మిల కూడా తండ్రి బాటలోనే ముందుకు సాగుతున్నారు. తన తండ్రి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర తరహాలో మరో ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 20వ తేదీన చేవెళ్ల నుంచే ఆమె తన పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వంపై పోరాట పంథాను ఎంచుకున్న షర్మిల తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు.

పాదయాత్రలో తనతో నడిచి కాలు కదుపుతున్న ప్రజానీకాన్ని చూసి వైఎస్ షర్మిల భావోద్వేగంతో స్పందించారు. ప్రజా ప్రస్థానంలో మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఎన్నటికీ మరువలేనని ఆమె అన్నారు. మీ కన్నీళ్లను, కష్టాలను చూస్తుంటే మీకోసం పోరాడాలన్న తపన రెట్టింపవుతోందన్నారు. వైఎస్ బిడ్డగా మాటిస్తున్నానని.. ప్రజల తరుఫున కడవరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు.

పాదయాత్ర ప్రారంభం నుంచి ఆమె ప్రజలతో మమేకమవుతున్న దృశ్యాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ.. మహిళలను ప్రేమతో ఆలింగనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తండ్రి బాటనే ఎంచుకున్న షర్మిల పాదయాత్రలో అన్న వైఎస్ జగన్‌ను గుర్తుకు తెస్తున్నారు. ప్రజలను దగ్గరకు తీసుకుని.. గుండెలకు హత్తుకుని మాట్లాడుతున్న దృశ్యాలు హైలైట్‌గా నిలుస్తున్నాయి. రెండో రోజు పాదయాత్రలో మహిళలతో వైఎస్ షర్మిల ముచ్చటించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల నుంచి శంషాబాద్ వైపుగా పాదయాత్ర సాగుతోంది.