ఇక తేలిపోయింది…బీజేపీ నేతలతో వైసీపీ బుగ్గన భేటీ !

ySRCP buggana rajendranath reddy meets on bjp leaders at delhi

బీజేపీ, వైసీపీ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారన్న వార్తలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు కలసి వెళుతున్న దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తొలుత తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి లోకేష్ ఈ దృశ్యాలని పోస్ట్ చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను ఏపీ మంత్రి లోకేశ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రహస్య భేటీ ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తూ నాలుగు ఆఫ్షన్లు ఇచ్చి చురకలంటించారు. 1) ఆపరేషన్ గరుడ 2) జగన్ కేసుల మాఫీ 3) తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అమ్మడం 4) పై వాటిల్లో అన్నీ… అంటూ ఎద్దేవా చేశారు.

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఢిల్లీలో బీజేపీ ఏపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఓ గదిలోకి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో పాటు ఆయన వెళ్లినట్లు మీడియా గుర్తించింది. వారంతా బీజేపీ అగ్రనేతలతోనూ సమావేశం జరిపినట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంపై కొంత కాలంగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, నిజాలు తేలాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలపైనే ఢిల్లీలో భేటీ జరుగుతోందని ఓ వార్తా ఛానెల్‌ పేర్కొంది.

ప్రత్యేక హోదా మొదలు నిన్నటి కడప స్టీల్ ప్లాంట్ వరకు ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని ఇంత జరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలవడం దేనికి సంకేతమని టీడీపీ ప్రశ్నిస్తోంది. బీజేపీతో వైసీపీ అంటకాగుతోందని అమిత్ షా, రామ్‌మాధవ్‌లతో బుగ్గన భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. బీజేపీ నేత ఆకుల సత్యనారాయణతో కలిసి ఒకే కార్లో బుగ్గన.. అమిత్ షా ఇంటికి వెళ్లారని బీజేపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే సాక్ష్యమని వారు ఆరోపిస్తున్నారు. బీజేపీకి వైసీపీ సిస్టర్ పార్టీ అని టీడీపీ విమర్శిస్తోంది.