ఇంచార్జ్ లకి ఫోన్ చేసి వైఎస్ జగన్ లా మాట్లాడుతూ డబ్బు డిమాండ్…!

YSRCP Complaint Lodged For Bluff Calls To Ys Jagans PA

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వ్యవహారాలు రచ్చకెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సమన్వయకర్తల నుంచి నిధుల వసూలు చేయడం, ఇవ్వని వారిని మార్చేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో నేతలు తమను జగన్ కోట్లకు కోట్లు అడిగారని అవి ఇవ్వకపోయే సరికి ఇతర నేతల్ని తీసుకొచ్చి సమన్వయకర్తలుగా నియమించారని అంతర్గతంగా ఆవేదన చెందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సోమవారం హైదరాబాద్‌లో వైసీపీ ఐటీ సెల్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పీఏ నాగేశ్వర్ రెడ్డి పేరును, ఫోన్ నెంబర్‌ను దుర్వినియోగం చేస్తూ ఆయన పేరుతో పార్టీ నేతలకు ఫోన్లు, మెస్సేజీలు పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని. ఆ ఫోన్ నెంబర్ లోటస్ పాండ్‌ ఆడ్రస్‌తో నమోదై ఉందని అందుకే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వైసీపీ నేతలు చెబుతున్నారు.

తొలుత జగన్ మాట్లాడతారని చెబుతారని, ఆపై జగన్ గొంతును మిమిక్రీ చేస్తూ, మరో వ్యక్తి మాట్లాడుతున్నారని చెప్పారు. మీ ఫోన్ కు ఓ మెసేజ్ వస్తుందని, దాన్ని ఫాలో అవండి అని జగన్ చెప్పినట్టుగా చెబుతూ, ఆపై డబ్బులు పంపాలని మెసేజ్ పెడుతున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, పార్టీ నాయకులు, ప్రముఖులకు ఇలా ఫోన్లు వస్తున్నాయని వెల్లడించిన వారు, దీనిపై పోలీసులు తక్షణం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఫోన్ నెంబర్ ఒక్కటే ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వెళ్లింది అంటే అది వాళ్లు చేసినట్లే లెక్క, లేకపోతే ఆ ఆఫోన్ ఇతరులకు అయినా ఇచ్చి ఉండాలి. అది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. మరి పోలీసుల వరకూ వైసీపీ నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ? అనేది చాలా మందికి అనుమానం వస్తున్న ప్రశ్న.