సదావర్తి భూముల కేసులో వైసీపీకి కొత్త భయం?

ysrcp scared about sadavarti lands

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సదావర్తి భూముల కేసులో ఉమ్మడి హై కోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంప పెట్టని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా సాక్షి చెప్పినట్టు చూస్తే ఓ వెయ్యి కోట్ల దాకా లాభం కూడా వస్తున్నట్టే. ఎందుకంటే వివాదానికి కేంద్ర బిందువు అయిన సదావర్తి సత్రం భూమి 84 ఎకరాల విలువ వెయ్యి కోట్లకి పైనే అని సాక్షి ప్రచారం చేసింది. దాని ఆధారంగానే కేసు వేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సైతం కోర్టులో ఇదే వాదన వినిపించారు. దీంతో చంద్రబాబు సర్కార్ తాము అమ్మినదానికన్నా 5 కోట్లు ఎక్కువ ఇచ్చినా ఆ భూములు అప్పగిస్తామని కోర్టుకి విన్నవించింది. ఈ వాదనకు ఒప్పుకున్న ఆర్కే కోర్టుకు ఆ భూములు తీసుకోడానికి సిద్ధమని చెప్పిన విషయం, కోర్టు చెల్లింపుపై కొంత గడువు ఇవ్వడం అందరికీ తెలిసిందే.

ఈ పరిణామం చంద్రబాబు సర్కార్ కి ఎదురు దెబ్బగా వైసీపీ అభివర్ణించింది. కానీ సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సైతం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్పందించారు. ఓ 5 కోట్లు ఎక్కువ ప్రభుత్వానికి రావడం మంచిదే అని చెప్పారు. ఇక మరో మంత్రి లోకేష్ కూడా వైసీపీ కోర్టుకి చెప్పినట్టు ఆ మొత్తం చెల్లించి భూమిని సొంతం చేసుకుంటారో లేదో చూడాలని వ్యాఖ్యానించారు. అటు వెయ్యి కోట్లు లాభం దక్కుతుందని భావిస్తున్న వైసీపీ 27 కోట్లు చెల్లించడానికి రెడీ కావాలి. కానీ అప్పుడే సాక్షిలో లోకేష్ పేరుతో ఓ కొత్త భయాన్ని బయటపెట్టింది. అదేమిటంటే… సదావర్తి భూములకు డబ్బు కడితే ఐటీ దాడులు జరుగుతాయని, ఒకవేళ కట్టకపోతే వైసీపీ ఓడిపోయినట్టు అవుతుందని లోకేష్ అన్నట్టు వ్యాఖ్యానించింది. లోకేష్ అన్నా అనకపోయినా అంత పెద్ద మొత్తం పెడుతున్నప్పుడు ఐటీ శాఖ కన్ను పడకుండా ఉంటుందా ? కోర్టుకి హామీ ఇచ్చాక ఇప్పుడు ఐటీ దాడులు అని వైసీపీ భయపడుతోంది అంటే ఆశ్చర్యంగా వుంది. చూడాలి ఇప్పుడు వైసీపీ ఏమి చేస్తుందో?. ఓ వైపు కోర్టుకి ఇచ్చిన మాట, ఇంకో వైపు ఐటీ శాఖ డేగ కన్ను, మరో వైపు పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్న జనం. మొత్తానికి వైసీపీ భలే ఇరుక్కుంది.

మరిన్ని వార్తలు

మోడీ కంటే ఎక్కువ చేస్తున్న కేసీఆర్