జుక‌ర్‌బ‌ర్గ్‌ సంచళన నిర్ణయం: కస్టమర్లకు, వ్యాపారులకు సరికొత్త అవకాశాలు

రిల‌యన్స్, జియో ఫ్లాట్‌ఫామ్‌లో ఫేస్‌బుక్ భారీ పెట్టుబ‌డులు పెట్టిన విష‌యం తెలిసిందే. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌.. దీనిపై ప్ర‌క‌ట‌న చేశారు. జియో ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌నున్నామ‌ని.. అదేవిధంగా.. పలు కీల‌క ప్రాజెక్టుల‌పై ప‌నిచేయ‌నున్నామ‌ని.. దీంతో భార‌త్‌లో వాణిజ్య అవ‌కాశాలు మెరుగ‌య్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జుక‌ర్‌బ‌ర్గ్ తెలిపారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ను ఎక్కువ సంఖ్య‌లో భార‌తీయులు వాడుతున్నార‌ని.. ఎంతో మంది పారిశ్రామిక‌వేత్త‌లు కూడా వీటిని వినియోగిస్తున్నార‌ని స్పష్టం చేశారు.

అదేవిధంగా దేశం ప్ర‌స్తుతం డిజిట‌ల్ మార్పు ద‌శ‌లో ఉంద‌ని.. ల‌క్ష‌ల సంఖ్య‌లో భార‌తీయుల‌ను, వ్యాపార‌వేత్త‌ల‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకు వ‌చ్చేందుకు జియో కీల‌క పాత్ర పోషించింద‌ని జుక‌ర్‌బ‌ర్గ్ వెల్లడించారు. అలాగే.. చిరు వ్యాపారులే ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కీల‌క‌మ‌ని.. అలాంటి వారికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని.. భార‌త్‌లో సుమారు 6కోట్ల మంది చిన్న వ్యాపారులు ఉన్నార‌ని అన్నారు. వారిపై లక్ష‌లాది మంది ఉద్యోగాల కోసం ఆధార‌ప‌డుతున్నార‌ని వివరించారు.

కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న ఈ తరుణంలో ఇలాంటి ఔత్సాహిక పారిశ్రామిక‌ వేత్త‌ల‌కు డిజిట‌ల్ సాధనాల అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అన్నారు. క‌స్ట‌మ‌ర్లకు, వ్యాపార‌వేత్త‌ల‌కు సహాయం చేసేందుకు తాము జియోతో జ‌త‌క‌ట్టామ‌ని జుక‌ర్‌బ‌ర్గ్ స్పష్టం చేశారు. భార‌త వ్యాపారుల‌కు, ప్ర‌జ‌ల‌కు కొత్త అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని కూడా వివరించారు. అలాగే ముఖేశ్ అంబానీ, జియో టీమ్ మొత్తానికి జుక‌ర్‌బ‌ర్గ్ కృతజ్ఞతలు తెలిపారు.