రూల్స్‌కి వ్యతిరేకంగా జ్వెరెవ్‌ పార్టీ

రూల్స్‌కి వ్యతిరేకంగా జ్వెరెవ్‌ పార్టీ

కరోనా మహమ్మారి విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఈ వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో పడిన వర్ధమాన టెన్నిస్‌ క్రీడాకారుల కోసం నిధులు సేకరించాలనే సదుద్దేశంతో జొకోవిచ్‌ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ టోర్నీ నిర్వహించగా, అది వారి పాలిట శాపంగా మారింది. ఈ ఎగ్జిబిషన్‌ టోర్నీలో పాల్గొన్న ప్రపంచ 19వ ర్యాంకర్‌ గ్రిగర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా), క్రొయేషియా ఆటగాడు బోర్నా చోరిచ్, నొవాక్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌ మార్కో పానిచిలు సైతం ఈ మహమ్మారి బారిన పడ్డారు.

కాగా, ఇదే టోర్నీల్లో పాల్గొన్న మిగతా వారిని సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించగా, జర్మనీకి చెందని అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ దానిని అతిక్రమించాడు. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సిన జ్వెరెవ్‌ ఎంచక్కా పార్టీ చేసుకున్నాడు. ఒక క్లబ్‌లో విపరీతమైన జన సందోహంలో జ్వెరెవ్‌ పార్టీ చేసుకుని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో విమర్శల పాలయ్యాడు. అసలు ఆ ఆడ్రియా టూర్‌లో భాగంగా ఎగ్జిబిషన్‌ టోర్నీలో పాల్గొన్నందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన జ్వెరెవ్‌.. మాట వరసకు చెప్పాలి కదా అనే సూత్రాన్ని మాత్రమే పాటించినట్లున్నాడు. ఒకసారి ప్రజలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటానన్న జ్వెరెవ్‌.. ఏకంగా క్లబ్‌లోనే సందడి చేశాడు. జనం మధ్యలో దూరి డ్యాన్స్‌ మరీ చేశాడు. దాంతో నెటిజన్లు జ్వెరెవ్‌ను ఏకిపారేస్తున్నారు.

‘ఒక ప్రైవేట్‌ క్లబ్‌లో జ్వెరెవ్‌ చిందులు వేస్తూ కనిపించడం క్లియర్‌గా కనిపించింది. ఇదేనా సెల్ఫ్‌ ఐసోలేషన్‌’ అంటూ ఒకరు విమర్శించగా, ‘ఆరు రోజుల క్రితం ఏమి చెప్పావ్‌ జ్వెరెవ్‌.. ఇప్పుడు ఏమి చేస్తున్నావ్‌’ అంటూ మరొకరు మండిపడ్డారు. ‘ ఆటగాళ్లు రూల్స్‌ ఫాలో కావడం లేదు అనే దానికి ఇదొక ఉదాహరణ. ఇది చాలా బాధపెట్టే అంశం. మిగతా వారిని కూడా ప్రమాదంలోకి నెట్టడం భావ్యమా’ అని మరొకరు విమర్శించారు ‘పబ్లిక్‌కు సంబంధించి గైడ్‌లైన్స్‌ ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా.. ఇదే ఒక సెలబ్రెటీగా నువ్వు ఇచ్చే సందేశం’ అని అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు.