కరోనా వైరస్ తో అంతా ఇంటికి పరిమితం కావడంతో ఈ ఏడాది అంతగా ఎండతీవ్రత ప్రజలకు తాకలేదు. కానీ ఈ మధ్య లాక్ డౌన్ సడలింపులతో కాస్త పనికోసం ఎవరైనా ఇల్లు దాటితే ఎండ తన ప్రతాపాన్ని చూపుతోంది. మరీ ముఖ్యంగా గత రెండు మూడు రోజుల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని తీవ్రంగా చూపుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు భయపడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
ముఖ్యంగా ఈ రోజు ఉదయం 7 గంటలకే ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. ఎండ వేడిమికి రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో మూడు రోజుల పాటు రాష్ర్టంలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కాగా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. అసలే రోహిని కార్తె కావడంతో రోళ్లు పగిలేలా మరికొన్ని రోజులు సూర్యుడి భగభగలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకోసం ప్రజలంతా ఇంటిపట్టునే ఉండాలని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే.