ఇదే కదా ఫ్రెండ్ అంటే….

Friend.

స్నేహం…

అందరికి తెలిసిన విషయమే అందరూ అనే మాటే, మనం మాత్రమే ఎంచుకునే బంధం. మనం ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది కూడా మనము ఎంచుకునే బంధమే కదా..! స్నేహం ఒక్కటే ఎలా అవుతుంది….! ప్రేమిస్తే సరే, అలా కాకుండా ఇంట్లోవాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకుంటే…! సరే, ఎంచుకొని నచ్చిన వాళ్లనే పెళ్లిచేసుకున్నాము అనుకో… పెళ్లి అనే ముడి ఉంటది, ఈ స్నేహానికి మాత్రం ఒక ముడి ఉండదూ, పాడు ఉండదూ… ఉంటే రక్తసంబంధం, లేకపోతే వైవాహిక బంధం, ఫలానా వాళ్ళే అని ఈ రేలేషన్కి వీళ్ళే అని ఉంటది. మరి ఎంత మంది పడితే అంతమందికి పంచేసే స్నేహబంధంలో ఏముంది…! అమ్మ, నాన్న, భర్త, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు… వీళ్ళతో సమానమా ఫ్రెండ్…! వీళ్ళు అయితే ఎప్పుడూ మనతోనే ఉంటారు, ఫ్రెండ్ అయితే మన ఇంట్లో ఉండడు, కానీ మనం ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి పనీ పాటాలేనోడిలా వచ్చేస్తాడు… ఇలాంటోడు మనకి అవసరమా….! బాధ్యత కాబట్టి అమ్మనాన్న డబ్బులు ఇస్తారు… అసలు ఈ ఫ్రెండ్ గాడికి ఏం పని, ఊరికే మన మీద డబ్బులు వేస్ట్ చేస్తాడు..!

కులం, మతం, పెద్ద, చిన్న, లింగభేదాలనీ ఏమీ ఉండవు…  సంకర బంధం అనాలి, స్నేహబంధం అంటారు ఏంటో… అమ్మలేనోళ్ళు ఉంటారు, నాన్నలేనోళ్ళు ఉంటారు, భర్త, భార్యాలేనోళ్ళు ఉంటారు, పిల్లలు లేనోళ్ళు ఉంటారు, అసలు బంధువనేవాడేలేనోళ్ళు ఉంటారు, కానీ ఈ ఫ్రెండ్ లేనోళ్ళు ఉండరేంటో అసలు… ఏమయినా అంటే నీకు అన్నీ నేనే అనే గొప్పోళ్ళు కూడా ఉంటారేంటో…! మనకి బాధ ఉంటే మన ఇంట్లో వాళ్లకి చెప్పాలి గానీ వాళ్లకి కూడా చెప్పకుండా ఫ్రెండ్ కి చెప్పుకుంటాం ఏంటి వింతగా…! ఈ భూమ్మీద ఆ రిలేషన్ని టచ్చెయ్యని వాళ్లే లేరా..! ఫ్రెండ్ కి నిజంగా అంత వాల్యూ ఉంటుందా..! స్నేహం అంటే అంత గొప్ప సంబంధమా…! అయితే, మా అమ్మపొట్టలో నుండి బయటకి వచ్చిన తరువాత నేను కూడా ఈ ఫ్రెండ్ షిప్ ఫ్లేవర్ ని టేస్ట్ చెయ్యాలి. ఇన్నాళ్లు ఈ పొట్టలో ఉండి ఈ అనుమానాలన్నీ పేరుకుపోయాయి… మా అమ్మకి నాన్న కి ఫ్రెండ్స్ ఎక్కువ మరి…

కడుపులో ఉండగానే పద్మవ్యూహం గురించి విన్న అభిమన్యుడి లాగా ఈ బుడ్డోడు కూడా ఫ్రెండ్ అంటే ఏంటో తెలిసేసుకున్నాడు….

– గణేష్ గుల్లిపల్లి