ఎంతటి కష్టమయ్యా: ఆర్థిక కష్టాల్లో భద్రాద్రి రాముడు

తెలంగాణలోని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయానికి కొంతకాలంగా నిధుల కొరత ఏర్పడుతోంది అని సమాచారం. మొన్నటి వరకు ఆర్టీసీ సమ్మె, ఆ తర్వాత పాపికొండల యాత్రకు బ్రేక్, ఆలయంపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. తాజాగా లాక్ డౌన్ ప్రభావంతో రామయ్య ఆదాయానికి గండి పడింది. రెండు నెలలుగా దర్శనాలు నిలిచి పోవడంతో హుండీలో కానుకలు లేకుండా పోయాయి. నిత్యాన్నదానానికి కూడా కొద్ది రోజులుగా విరాళాలు ఆగిపోయాయి.

అయితే కరోనా లాక్ డౌన్ ఏకంగా శ్రీరామ నవమి వేడుకలకు ఎసరు పెట్టింది. ఏటా ఆరు బయట అంగరంగ వైభవంగా జరిగేది స్వామి వారి కల్యాణం. భక్తులు భారీ సంఖ్యలో రామయ్య కల్యాణానికి తరలి వచ్చేవారు. ఆ ఒక్క నెలలోనే నాలుగు కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. కానీ ఈసారి స్వామ వారి కల్యాణం నిరాడంబరంగా జరిగింది. ఉత్సవాల కోసం అప్పటికే కొన్ని ఏర్పాట్లను చేపట్టారు. ఆ తర్వాత ఉత్సవాలకు బ్రేక్ పడటంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం అత్యంత ఆదాయ వనరుగా ఉంటుంది. ముత్యాల తలంబ్రాల విక్రయాల ద్వారా కాసుల వర్షం కురిసేది. అయితే ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. పోస్టల్ ద్వారా విక్రయాలను చేపట్టినప్పటికీ.. పెద్దగా ఆదాయం రాలేదు. ఇకపోతే ఆన్ లైన్ లో ఆర్జిత సేవలను ప్రారంభించిన ఆశించిన స్పందన రాలేదు. రెగ్యులర్ తాత్కాలిక సిబ్బందికి కలిపి నెలకు తొంభై లక్షల నుంచి కోటి వరకు ఆలయ జీతాలు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా ఇప్పుడు ఆదాయం లేక పోవడంతో ఇప్పటికే తాత్కాలిక సిబ్బందికి జీతాలు నిలిపివేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఫిక్సెడ్ డిపాజిట్లపై నెలకు ఇరవై ఐదు లక్షలు వడ్డీగా వస్తూండగా.. వేర్వేరు ఖాతాల్లో ఉన్న కొన్ని నిల్వల సాయంతో ప్రస్తుతానికి సిబ్బంది జీతభత్యాలు చెల్లిస్తున్నారు. అన్ని దారులూ మూసుకుపోవడంతో భద్రాచలం రాముడిని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు సిబ్బంది జీతాలు ఎలాగోలా నెట్టుకొచ్చినా ఇక నుంచి అది కూడా కష్టంగా మారే ప్రమాదం ఉందని ఆలయ కమిటీ అభిప్రాయపడుతోంది. మొత్తానికి భద్రాద్రి రాముడికి కూడా ఆర్థిక భద్రత కరువైనట్లు తెలుస్తోంది.