స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబుని ఏపీ సిఐడి పోలీసులు శనివారం నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టుపై తాజాగా స్పందించారు మంత్రి ఆదిమూలపు సురేష్. చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని అన్నారు మంత్రి సురేష్. నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందిస్తానని ఆశ చూపి వారి డబ్బును లూటీ చేయడంలో ఆయన నైపుణ్యం చూపించాడని దుయ్యబట్టారు.
అమరావతి నిర్మాణం, పేదలకు ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేశాడన్నారు. జీఎస్టీ, ఈడి, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే అన్ని ఆధారాలు బయటపెట్టాయని తెలిపారు. ఇందులో ప్రమేయం ఉన్న మరికొందరిని అరెస్టు చేయడం కూడా జరిగిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అన్ని జిల్లాలలోని టిడిపి నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.