తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది. అయితే టెన్త్ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన హైకోర్టు… టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి రెడీగా ఉన్నామని టీ సర్కార్.. హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్ పై విచారణ జరపింది కోర్ట్. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.
అయితే జూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని సూచించిన హైకోర్టు.. జూన్ 4న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో జూన్ 8న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా చూడాలని తెలిపింది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని హైకోర్ట్ వెల్లడించింది. దీంతో తాము అన్ని చర్యలు చేపట్టేందుకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.