మొన్న టమాట.. నిన్న కందిపప్పు.. ఇవాళ చక్కెర.. ఇలా రోజుకో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా భారత్లో చక్కెర ధరలు చుక్కలంటుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో చక్కెర ధరలు 3 శాతానికిపైగా పెరిగాయి.
ఇవాళ మెట్రిక్ టన్ను చక్కెర ధర రూ.37,760గా ఉన్నదని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. చక్కెర నిల్వలు పడిపోతున్న క్రమంలో రాబోయే పండుగ సీజన్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని ముంబయికి చెందిన వ్యాపారి ఒకరు అంచనా వేశారు. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటకలోని చెరకు పండించే ప్రధాన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. వచ్చే సీజన్లో పంట దిగుబడి తగ్గవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. చక్కెరను తక్కువ ధరకు విక్రయించేందుకు మిల్లులు ఆసక్తి చూపడం లేదని బాంబే షుగర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హోల్సేలర్ల వద్ద చక్కెర నిల్వలపై పరిమితులు విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై వచ్చే వారం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది .