భీమవరంలోని అల్లూరి సీతారామ విగ్రహావిష్కరణలో నరేంద్ర మోదీ..

నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ

భీమవరంలోని అల్లూరి సీతారామ విగ్రహావిష్కరణ సభకు హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు” అంటూ అల్లూరి సీతారామరాజు గొప్పదనాన్ని తెలుగులో చెబుతూ అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగువీర లేవరా అన్న శ్రీశ్రీ పాటను గుర్తు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాదాలకు నమస్కరిస్తూ, దేశం తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు. ఆయన వారసులూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించటం సంతోషంగా ఉందని అన్నారు. ఈనేలపై జన్మించి, స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన ఆదివాసీలందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాని చెప్పారు.

భారత స్వాతంత్ర్య సమర చరిత్ర కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదని, ఇందుకోసం బలిదానం చేసిన అందరిదీ అని చెప్పారు. ఈ పోరాటం మన దేశంలోని భిన్నత్వాన్ని, సంస్కృతిని ప్రతిబించిందని అన్నారు. విదేశీ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టిన నాటికి అల్లూరి వయసు పాతికేళ్లు మాత్రమే. దేశం కోసం ఆయన 27 ఏళ్లకే అమరులయ్యారని గుర్తు చేశారు.ఈ 75 ఏళ్ల స్వాంతంత్ర్య మహోత్సవాలను అమృత కాలంగా భావించాలని, దేశం కోసం బలిదానం చేసిన వారందరినీ స్మరించుకోవాలని సూచించారు అడవిలో ఉండే వెదురుని కోసుకునే హక్కుని ఆదివాసీలకు గత ప్రభుత్వాలు కల్పించలేదని, తమ ప్రభుత్వం వచ్చాక వారికి ఆ హక్కు కల్పించామని స్పష్టం చేశారు ఇక్కడి వారికి మంచి విద్య అందించే ప్రయత్నాలనూ వివరించారు. మాతృభాషలో విద్యను నేర్చుకుంటే, ఆదివాసీ బిడ్డలకూ మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నవభారత నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.