శ్రీవారి దర్శన ఆటంకానికి ఇదే కారణం…

Hidden Facts Behind Tirumala Temple Temporary Closing

భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యం పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మనకు ఎంతో ప్రత్యేకమయినది. ప్రతీరోజు కొన్ని వేల మంది భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల దేవస్థానం ఒక ఐదు రోజులపాటు మూసివేయడం అనేది అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. అయితే, అష్టబంధన బాలలయం మహా సంప్రోక్షణా కార్యక్రమమే దీనికి కారణమని మనం వింటున్నాం. అసలు ఈ మహా సంప్రోక్షణ అంటే ఏమిటి? దీని ఆచరణకు గల కారణాలు ఏమిటో తెలియజేసే ఉద్దేశ్యమే ఈ కథనం.

12 సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కారాలలానే ప్రతీ వైష్ణవ దేవాలయాల్లో కూడా 12 సంవత్సరాలకొకసారి ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. కానీ, 17కి.మీ సౌరభం గల తిరుమల తిరుపతి దేవస్థానం వంటి పెద్ద దేవాలయంలో జరపడం చేత ఇది మన మాటల మధ్యకి వచ్చింది. మామూలుగా దేవాలయ గర్భగుడిలో స్వామి వారికి నిత్యం జరిగే అభిషేక అలంకరణలు కోసం పలు పాత్రలూ, సామాగ్రీలను లోపలకి బయటకి తిప్పడం జరుగుతుంది కాబట్టి వాటి ద్వారా మలినాలు గర్భగుడిలోకి వచ్చే అవకాశం ఉన్నందున, దానిని అపచారంగా భావించి గర్భగుడి లోపల ఆ మలినాలను శుభ్రం చేసి గర్భగుడిలో మరెవరు కాకుండా కేవలం ప్రధాన అర్చకులే మరమ్మతులు గావించడమే ఈ ఐదు రోజులు గుడి మూయడానికి క్లుప్తమయిన కారణం.

కానీ, శాస్త్రోక్తంగా చెప్పాలంటే.. స్వామి వారి మూల విరాట్ పాదాలకు పద్మపీఠం మధ్యభాగాన్ని లేపనంతో నింపటమే అష్టబంధన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా 8 రకాల వస్తువలతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదాల కింద మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచెక్కర, లక్క, చెకుముకిరాయి, బెళ్లం ఉంటాయి. ఈ వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్ తో పాటు ఆధార్ పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పై భాగంలో గోడకు ఉన్న రంధ్రాల్లో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాల క్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం, రంగు మారడం వల్ల మూలవిరాట్ లో శక్తి తగ్గితోతుంది. కాబట్టి, మూలవిరాట్లో  ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేసి, గుడికి ప్రక్కనే ఉన్న పాత కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 24 యాగశాలల వద్ద స్వామి వారి శక్తిని ఆవాహనం చేసిన కుంభాన్ని ఉంచుతారు. అక్కడ ఆ కుంభానికి స్వామి వారికి జరిగే అన్ని పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయడం ద్వారా స్వామి వారి మూలవిరాట్ శక్తి తగ్గిపోకుండా పెంపొందించే అవకాశం ఉంటుంది. ఐదు రోజుల తరువాత చివరి రోజున మళ్లీ శక్తిని కుంభం నుండి మూలవిరాట్లోకి ఆవాహనం చేస్తారు. ఈ పూర్తి కార్యక్రమాన్నే అష్టబంధన బాలలయ మహా సంప్రోక్షణ అంటారు. ఇది 1958లో మొదలయ్యింది, చివరగా 2006లో జరిపారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో నిర్వహిస్తారు.

కాగా, ఆగస్టు 11వ తేది శనివారం రోజు మొత్తంలో 9 గంటల సమయం, 12వ తేది ఆదివారం 4 గంటల సమయం, 13వ తేది సోమవారం 5 గంటల సమయం, 14వ తేది మంగళవారం 5 గంటల సమయం, 15వ తేది బుధవారం 6 గంటల సమయంలో మాత్రమే భక్తులకు శ్రీవారిని దర్శించే అవకాశం కల్పించనున్నారు. ఏది ఏమయినా అంతా మన ఏడుకొండల వాడి కోసమే, ఆయన ఉండేది మనకోసమే.