సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘ఆదిత్య-ఎల్1’ మిషన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్‌వీ-సీ57 వాహననౌక ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పుడు ఇది తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆదివారం ఇస్రో వెల్లడించింది.
ఆదివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో తొలిసారిగా ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో కక్ష్యను మార్చినట్లు చెప్పింది. ప్రస్తుతం భూమికి 22,459 కిలోమీటర్ల దూరంలో ఆదిత్య ఎల్-1 ఉందని పేర్కొంది. అయితే, ఇస్రో ఈ నెల 5న మరోసారి కక్ష్యను మార్చనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇస్రో పీఎస్ఎల్ వీ సీ-57 వాహకనౌక ద్వారా ఆదిత్య ఎల్-1ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. గతంలో చేపట్టిన చంద్రయాన్-3 తరహాలోనే ప్రయోగం సాగనున్నది . భూమి చుట్టూ తిరుగుతూ కక్ష్యను ఆదిత్య ఎల్-1 పెంచుకుంటూ సూర్యుడి దిశగా దూసుకెళ్లనున్నది. ఈ ఉపగ్రహం భూమి కక్ష్యలోనే 16 రోజుల పాటు ఉండనున్నది. ఐదుసార్లు కక్ష్యను మార్చుకొని లాగ్రాంజియన్-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచే ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది