Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం చివరిదశకు వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ బీజేపీ తరపున అనేక చోట్ల ప్రచారం నిర్వహిస్తోంటే…కాంగ్రెస్ లో మాత్రం అగ్రనాయకత్వం ప్రచారానికి దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. తన బహిరంగ సభలో మోడీ ఈ విషయాన్నే ఎత్తిచూపుతున్నారు. హిమాచల్ లో ఎన్నికల పోరు ఒకవైపే జరుగుతోందని ఉన్నలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత సభ్యుల దగ్గరే నమ్మకం కోల్పోయిందని, ఓడిపోతామని ముందుగానే అర్దం చేసుకుని సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రచారానికి రావడం లేదని మోడీ ఎద్దేవా చేశారు. మోడీ ఆరోపించినట్టుగానే…రాహుల్ గాంధీ గానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గానీ హిమాచల్ ప్రదేశ్ లో ప్రచారం నిర్వహించడం లేదు.
నిజానికి కాంగ్రెస్సే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి..ప్రతిపక్షం కన్నా ఎక్కువగా..అధికార పార్టీనే ప్రచారంలో ముందుండాలి. కానీ కాంగ్రెస్ ఎందుకనో ఆ రాష్ట్రంపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పై అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని పార్టీ నేతలే అంతర్గతంగా అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఓటమి అప్రతిష్టను ఖాతాలో వేసుకోవడం ఇష్టం లేకే అగ్రనేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారని సమాచారం. అందుకే రాష్ట్రస్థాయి నేతలే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని వెల్లడయింది. ఈ సర్వేలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్నివ్వగా కాంగ్రెస్ కు మాత్రం నిరుత్సాహాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలోని మొత్తం 68 స్థానాలకు ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 18న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బీజేపీ తరపున ప్రేమ్ కుమార్ ధమాల్ ప్రధాని అభ్యర్థిగా పోటీచేస్తుండగా…కాంగ్రెస్ తరపున సీఎం వీరభద్రసింగ్ బరిలో ఉన్నారు.