కళ్యాణ్ రామ్ 118 రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

118 Movie

పటాస్ తర్వాత కళ్యాణ్‌రామ్‌కు హిట్ అన్నదే లేదు. ఐనా ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది కాజల్‌తో ‘ఎమ్మెల్యే’, తమన్నాతో ‘నా నువ్వే’ సినిమాలు కూడా కళ్యాణ్‌ రామ్‌ను హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. తాజాగా ఈ నందమూరి నాయకుడు కే.వి.గుహన్ దర్శకత్వంలో ‘118’ సినిమా చేసాడు. మరి ఈ మూవీతో కళ్యాణ్ రామ్ హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ:

గౌతమ్(కళ్యాణ్ రామ్) ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆయన ఒకరోజు పార్టీకి వెళ్తే అక్కడ అనుకోకుండా ఒక కల వస్తుంది. ఆ కలలో ఆధ్యా అనే అమ్మాయిని ఎవరో హింసిస్తూ ఉంటారు. అదే కల మరో సారి కూడా వస్తుంది. యాదృచ్చికంగా అది నిజజీవితంలో కూడా ఆయనకు జరుగుతుంది. ఈ రెండు కలలు అతనికి అర్థరాత్రి 1 గంట 18 నిమిషాలకు వస్తూ వుంటుంది. నిజంగానే కలలో ఉన్న అమ్మాయి బయట కూడా ఉందని తెలుసుకుంటాడు. అసలు ఎవరు అమ్మాయి ఎందుకు ఆమెను కొడుతుంటారు. అసలు ఆమె ప్రాణాలతో ఉందా లేదా ఇవన్నీ ఎలా తెలుసుకుంటాడు అనేది 118 కథ.

కథనం:

కళ్యాణ్ రామ్ సినిమాలు అంటే కమర్షియల్ ఎంటర్టైనర్స్ అని ఫిక్స్ అయిపోయారు ప్రేకషకులు. కానీ వాటి నుంచి పూర్తిగా బ్రేక్ ఇచ్చి ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. ఇప్పటివరకు తన కెరీర్లో ఎప్పుడూ ట్రై చేయని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చేశాడు ఈయన. కొత్త దర్శకుడు కె.వి గుహన్ చెప్పిన కథను నమ్మి గుడ్డిగా ముందుకు వెళ్ళిపోయాడు కళ్యాణ్ రాం. దానికి ఫలితం కూడా చూపించాడు దర్శకుడు. తెలిసిన కథనే రాసుకున్నా కూడా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో 118 సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించాడు కె.వి.గుహన్. మొదటి సన్నివేశం నుంచి తను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టకుండా వేగంగా వెళ్ళిపోయింది. ప్రతి సీన్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. అసలు నివేదాథామస్ ఎవరు ఆమె ఎందుకు కళ్యాణ్ రాం కల లోకి వస్తుంది ? ఆమెను ఎవరు కొడుతున్నారు ? ఇవన్నీ ప్రశ్నలతో ఫస్టాఫ్ బాగానే రాసుకున్నాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలైన అన్వేషణ మొదలవుతుంది. కానీ కీలకమైన సెకండాఫ్లో కథ తెలిసి పోవడంతో కథలో వేగం తగ్గినట్లు అనిపించింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషనల్ కంటెంట్ బాగానే ఉన్నా అది మరీ రొటీన్ రివేంజ్ ఫార్ములా కావడంతో మైనస్ అయిపోయింది. హీరో కి కల రావడం ఆ కల నుండో ఆధారాలు తీసుకొని దాని నుంచి కథ ముందుకెళ్లడం, కాస్త కొత్తగా అనిపిస్తుంది తెలుగు ప్రేక్షకులకు ఇది టచ్ లేనట్లుగా అనిపించినా హాలీవుడ్ సినిమాల్లో ఇది బాగానే జరుగుతుంది. అలాంటి కథ తీసుకొని ఇక్కడ కొత్తగా ట్రై చేశాడు కె.వి.గుహన్ అయితే ఫస్టాఫ్ లో ఉన్న వేగం సెకండాఫ్ లో లేకపోవడం తో సినిమాపై ఒపీనియన్ మారుతుంది. క్లైమాక్స్ కూడా ఈజీగానే తేల్చేశాడు. ఓవరాల్గా సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి 118 ఒక మంచి ఛాయిస్ గా మిగిలి పోతుంది ఈ సినిమా.

నటీనటులు:

కళ్యాణ్రామ్ బాగా చేశాడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో ఒదిగిపోయాడు. అయితే డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం టెంపర్ సినిమా లో ఎన్టీఆర్ ను గుర్తు చేశాడు. శాలిని పాండే ఒక చిన్న పాత్రలో మెరిసింది. కథలో పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేని హీరోయిన్ పాత్ర అది. ఇక కొద్దిసేపే స్క్రీన్ మీద కనిపించినా కూడా నివేదా థామస్ మాయ చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో మళ్ళీ కనిపించింది ఈ ముద్దుగుమ్మ మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలలో బాగానే నటించారు.

టెక్నికల్ టీం:

శేఖర్ చంద్ర సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్యంగా కావలసింది ఆర్.ఆర్. ఈ విషయంలో శేఖర్ నూటికి నూరు మార్కులు సంపాదించాడు. ఎడిటింగ్ పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించాయి. సినిమాటోగ్రాఫర్గా కూడా కె.వి.గుహన్ మరోసారి తన సత్తా చూపించాడు ఇక ఆయన దర్శకుడిగా కూడా ఫర్లేదు అనిపించాడు. సెకండ్ హాఫ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉండుంటే 118 కచ్చితంగా కమర్షియల్గా కూడా విజయం సాధించే సినిమా అయ్యుండేది.

చివరగా: 118.. ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్