భారత్ ను వణికిస్తున్న వర్షం….కేరళను తలపిస్తున్న వరదలు…!

12 Killed As Rains Hit North India

ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు పట్టి కుదిపేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో హిమాచల్‌ ప్రదేశ్‌ చిగురుటాకులా వణుకుతోంది. కొండ ప్రాంతాలు ఎక్కువున్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇక పంజాబ్ అయితే మరో కేరళను తలపిస్తోంది. భారీ వరదల కారణంగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 12 మంది వరకు మరణించారు. వరదల్లో చిక్కుకున్న వేలాది మంది ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

india-rains

ఇప్పటికే ఇండియన్ నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. కొండ చరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్‌లో 126 రహదారులు, ఉత్తరాఖండ్‌లో 45 రహదారుల్లో వాహనాలు నిలిచిపోయాయి. జమ్ము కశ్మీర్‌లో 270 కి.మీ. జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. దేశ రాజధాని ఢిల్లీని కూడా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. రావి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రవాహ ఉద్ధృతికి లారీలు, కంటైనర్ల లాంటి పెద్ద పెద్ద వాహనాలే కొట్టుకుపోతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

heavy-rains-in-india