దేశంలో రోజురోజుకీ పరిస్థితులు దిగాజారిపోతున్నాయి. కులాల నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అగ్ర కులానికి చెందిన ఓ బాలికకు చాక్లెట్లు ఇచ్చి చేయి పట్టుకున్న కారణానికి 13 ఏళ్ల బాలుడిని దారుణంగా కొట్టి, బట్టలు విప్పించి పరుగెత్తించిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం స్థానిక పాఠశాలలో చదువుకునే తక్కువ కులానికి చెందిన బాలుడు సాయంత్రం ఇంటికి వెళ్తు తన తరగతిలోని తోటి బాలికకు చాక్లెట్లు ఇచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. ఇంటికి వెళ్లాక బాలిక ఈ విషయాన్ని తల్లిందండ్రులకు చెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు తలెత్తాయి.
దీంతో ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు ముంబయిలోని బంధువుల ఇంటికి పంపారు. విషయం తెలుసుకున్న ఆమె మేనమామ ఆ చేయి పట్టుకున్న బాలుడిని గదిలో బంధించి తీవ్రంగా కొట్టాడు. అంతేకాక బాలుడి ఇంటి నుంచి పంచాయతీ కార్యాలయం వరకూ నగ్నంగా పరిగెత్తించాడు. అసభ్యకర పదజాలంతో దూషించాడు. బాలుడిని అవమానపరిచిన వారి మీద ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.