ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని రేప్‌కు గురికావడంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన తమిళ నాడులో జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులోని కడలూరు జిల్లా సేద్దియతోపు ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల బాలిక అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. అయితే ఆ బాలిక తన ఇంటికి నడచి వెళుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మాయ మాటలు చెప్పి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడి చేసి అక్కడే వదిలేశాడు.
అయితే ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు వెతుకుతుండుగా దగ్గరలో ఉన్న ఓ ఆలయం వెనుక బాలిక స్పృహతప్పి పడి ఉంది. దీంతో ఏమి జరిగిందని తన కూతురిని తల్లిదండ్రులు ప్రశ్నించగా ఏమీ చెప్పని బాలిక ఆ తర్వాత ఇంట్లో ఉన్న పంటలకు చల్లే క్రిమి సంహారక మందును తాగి స్పృహ తప్పి పడిపోయింది. ఈ చర్యతో షాక్ తిన్న బాలిక తల్లిదండ్రులు బాలికను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత స్పృహ వచ్చిన బాలికను నెమ్మదిగా విషయం అడగగా ఓ యువకుడు తనపై లైంగిక దాడి జరిపాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సేద్దియతోపు మహిళా పోలీసుస్టేషన్ పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన తిలకర్, అతని స్నేహితుడు జయశంకర్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.