Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దసరా పండుగ వేళ ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వేస్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. లోకల్ రైళ్లు ఎక్కువగా ఆగే ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. ఈ ఉదయం కూడా అలానే చాలా మంది గమ్యస్థానాలు చేరేందుకు స్టేషనన్ కు వచ్చారు. అయితే వర్షం కురుస్తుండటంతో వారంతా అక్కడే తాము ఎక్కాల్సిన రైళ్ల కోసం ఎదురుచూస్తూ నిల్చున్నారు. వర్షం ఆగుతుండగానే… నాలుగు రైళ్లు అక్కడకు ఒకేసారి వచ్చాయి. దీంతో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు హడావిడి పడ్డారు. అందరూ ఒకేసారి రైళ్ల వద్దకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ దుర్ఘటనలో 22 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సంగతి తెలుసుకున్న పోలీసులు, వైద్యసిబ్బంది రైల్వేస్టేషన్ కుచేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పండుగ వేళ ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విచారం వ్యక్తంచేశారు. భారీ వర్షం కారణంగా పెద్దసంఖ్యలో ప్రయాణికులు వంతెనపైకి వచ్చరాని… వర్షం ఆగిపోగానే… వారంతా రైళ్లు ఎక్కేందుకు ఒకేసారి ప్రయత్నించడంతో తొక్సిసలాట జరిగిందని రైల్వే పీఆర్వో అనిల్ సక్సేనా తెలిపారు.