అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సోమయాజులు కమిషన్ తన నివేదిక సమర్పించింది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన దుర్ఘటనపై సభలో కమిషన్ నివేదిక ప్రవేశపెట్టింది ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించింది. ఒకే ముహుర్తంలో స్నానాలు చేయాలన్న నమ్మకం వల్లనే ప్రమాదం జరిగినట్లు కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అతిశయోక్తితో కూడిన సిద్ధాంత రాద్ధాంతం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలపింది.
ఒకేరోజు ఒకే ముహుర్తం పుష్కర స్నానం చేయాలన్న సాంప్రదాయం ఎక్కడ లేదని,గుడ్డి నమ్మకాలతో ప్రజలు విపత్తును గుర్తించలేకపోయారన్నారు. ప్రసారమాధ్యమాలు ఇంగితం లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమన్నారు.
దుర్ఘటనకు సీఎం కారణం కాదని నివేదికలో అభిప్రాయపడింది కమిషన్. సీఎం వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగిందని రాజకీయ లబ్ది కోసమే కొందరు ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించింది. ప్రమాదం జరిగిన ఘాట్ వెడల్పు 300మీ మాత్రమే ఉండటం పుష్కర ముహూర్తంపై అనవసర ప్రచారం వల్ల జనం రద్దీ పెరగడం తదితర కారణాలతోనే దుర్ఘటన జరిగిందని కమిషన్ తెలిపింది. అధికారంలో లేని పార్టీలు, రాజకీయ శత్రుత్వం ప్రతి అంశాన్ని విమర్శలకు వాడుకోవడాన్ని కమిషన్ నివేదికలో ప్రస్తావించింది.