Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహాకూటమికి గుడ్ బై చెప్పి..జేడీయూ, ఎన్డీఏతో జత కట్టిన తరువాత తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్..ప్రధాని మోడీ కలిసి ఒకే వేదికపై కనిపించారు. పాట్నా యూనివర్శిటీ శతవార్షికోత్సవాల్లో వారిద్దరూ పాల్గొన్నారు. వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాట్నా యూనివర్శిటీకి కేంద్ర విశ్వవిద్యాలయం హోదా కల్పించాలని నితీశ్ కుమార్ మోడీని కోరారు. అనంతరం ప్రసంగించిన మోడీ..బీహార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతీ రాష్ట్రంలో సివిల్ సర్వీస్ హోదాలో ఉన్న అధికారుల్లో ఎక్కువమంది పాట్నా యూనివర్శిటీలో చదువుకున్న వాళ్లే అని ప్రధాని అన్నారు.
జ్ఞానం, గంగా ఉన్న ప్రదేశం బీహార్ అని ప్రధాని కొనియాడారు. ఈ నేల చాలా ప్రత్యేకమయినదని, వర్శిటీ విత్తనం నాటి వందేళ్లు అయినా…ఇప్పటికీ ఫలాలు ఇస్తోందని ఆయన చెప్పారు. ఎలా నేర్చుకోవాలనే దానిపై దృష్టి సారించాలని, ఎలా బోధించాలనే దానిపై కాదని, మోడీ అభిప్రాయపడ్డారు. నేర్చుకోవడంలో సరికొత్త ఆవిష్కరణలను ఎంచుకోవాలని సూచించారు. పాట్నా యూనివర్శిటీలో పర్యటించిన తొలి ప్రధాని తానే అని నితీశ్ చెప్పారన్నారు. 2022 నాటికి బీహార్ దేశంలోనే సంపన్నరాష్ట్రంగా మారుతుందని మోడీ విశ్వాసం వ్యక్తంచేశారు. గంగానదీ తీరంలో ఉన్న పాట్నా యూనివర్శిటీ స్థాపించి అక్టోబరు 1 నాటికి వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వేడుకలను నిర్వహించారు.