14ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం.. ఇప్పుడు ప్రతిపక్షంగా కదనోత్సాహం.. మొత్తంగా గులాబీసేన 25వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అధికార పార్టీగా పదేళ్లపాటు పండగలా ఆవిర్భావ వేడుకలు చేసుకున్న కారు పార్టీ.. ఇప్పుడు విపక్షంగా రజోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఉద్యమకాలం నుంచి సెంటిమెంటల్‌గా కలిసొచ్చిన వరంగల్, కరీంనగర్ జిల్లాలనే.. ఈ వేడుకలకు వేదికగా ఎంచుకున్న గులాబీపార్టీ.. అక్కడి నుంచే మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుంది. ఉమ్మడి జిల్లాల మధ్య పొలిమేరల్లోనే మహాసభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈసారి బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు… రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.