కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ కొన్ని హిందూ సంస్థలు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గత వారం బిందు, కనక దుర్గ అనే ఇద్దరు నిషేదిత వయసు మహిళలు స్వామి వారి దర్శనం చేసుకొని రావడం తీవ్ర దుమారానికి దారి తీసింది. కేరళ రాష్ట్ర వ్యప్తగా తీవ్ర నిరసనలకు, ఆందోళనలకు కారణమైంది. తాజాగా ఇప్పుడు 36 ఏళ్ల మంజు అనే ఓ దళిత మహిళ తాను వృద్ధ మహిళల కనపడదనిక్ తలకు తెల్ల రంగేసుకొని ఆలయంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది.
మహిళా ఫెడరేషన్ కార్యకర్త అయిన ఆమె ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొంది. జుట్టుకు రంగేసుకొని ఆలయంలోకి 18 మెట్ల ద్వారా దర్శనానికి వెళ్లానని, ఇక మీదటా ఆలయంలోకి వెళ్తానని తెలిపింది. దీంతో విషయం తెలుసుకున్న ఆందోళన కారులు ఈమె ఇంటిపై దాడి చేశారు. గత అక్టోబర్లో ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 20 మంది మహిళల్లో ఈమె ఒకరు. అయితే, మంజు తనకు తానుగా ఆలయంలోకి ప్రవేశించానని చెప్పడంతో ఆలయాధికారులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆమె ప్రవేశించింది అని చెప్పడానికి ఎటువంటి సరైన ఆధారాలూ లేవని పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఆలయంలోకి 10 మంది మహిళలు ప్రవేశించారనే దాంట్లో వాస్తవం లేదని వెల్లడించారు. అయితే ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫోటో నిజమైనదో కాదో నిపుణులు పరిశీలిస్తున్నారు.