ఒక మహిళ మీద 40 మంది ?

40-men-brutalise-women-for-4-days-in-guest-house

చెన్నైలో మానసిక వికలాంగురాలైన 12 ఏళ్ల ఓ బాలికపై 22 మంది అత్యాచారం చేసిన ఘటన ఆగ్రహజ్వాలలు చల్లారకముందే అలాంటిదే మరో కిరాతకం బయటకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి 22 ఏళ్ల ఓ మహిళపై అరాచకంగా ప్రవర్తించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉద్యోగానికి వెళ్లిన యువతి నాలుగు రోజుల నుంచి తిరిగి రాలేదు. ఈ విషయమై గురువారం చంఢీగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతిని గుర్తించారు. కాగా తనను 40 మంది వ్యక్తులు బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. జూలై 15వ తేదీనాడు తనను అపహరించారని, అప్పటి నుంచి జూలై 18 వరకు నాలుగు రోజులు తనపై పైశాచికాన్ని ప్రదర్శించారని పోలీసుల ఎదుట వాపోయింది.

హర్యానాలోని పంచ్‌కులాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తనకు ఉద్యోగమిస్తానని తన భర్తకు చెప్పిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఉద్యోగం కోసం తన గెస్ట్ హౌస్‌కు రమ్మని చెప్పి అక్కడే బంధించి.. అతడితో పాటు మరో 39 మంది తనపై అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మోర్నీ హిల్ ఏరియాలోని మారుమూల ప్రాంతంలో గెస్ట్ హౌస్ ఉండటం వల్ల బాధితురాలి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. బాధితురాలిని వైద్య చికిత్స అందించడానికి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసులో గెస్ట్ హౌస్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.