Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాలలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు చెమటోడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్ గా భావిస్తున్న నంద్యాల ఉపఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందుకోసం సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు పంచడం ఈరోజుల్లో కామనైపోయింది. అందుకే నంద్యాల ఓటర్లకూ రేటు ఫిక్స్ చేశారు నేతలు. అధికారికంగానే ఐదువేలంటున్నారు.
పబ్లిగ్గానే ఐదువేలు చెబుతుంటే.. లోగుట్టు పెరుమాళ్లకెరుక అనేలా రాజకీయాలు నడుస్తున్నాయి. మద్యం కూడా ఏరులై పారుతోంది. ఇప్పటికే నదుల్లో నీళ్లు లేకపోయినా డబ్బు ప్రవాహానికి మాత్రం లోటు లేదని విమర్శకులు మండిపడుతున్నారు. అధికార పార్టీ ప్రలోభాలతో పాటు అభివృద్ధికి కూడా భారీగా ఖర్చు పెడుతుండగా.. ప్రతిపక్షం మాత్రం ప్రలోభాలతోనే సరిపెడుతోంది.
ఎవరికి వారు ప్రత్యర్థుల దగ్గర డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం మాకే వేయండని లౌక్యం ప్రదర్శిస్తున్నారు. అటు నంద్యాల ఓటర్లు కూడా పిచ్చివాళ్లు కాదు. వారు అభివృద్ధిని, నేతల ఆరోపణల్ని బేరీజు వేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యల ప్రభావం నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. జగన్ చంద్రబాబును, రోజా అఖిలప్రియను టార్గెట్ చేయడంపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. మరి చూడాలి ఫలితం ఎలా వస్తుందో.