Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు వారి సత్తా అంతర్జాతీయంగా చాటిన బాహుబలి -2కు మూడు జాతీయ అవార్డులు దక్కాయి. నెలన్నర క్రితం అనూహ్య పరిస్థితుల్లో దుబాయ్ లో కన్నుమూసిన అతిలోక సుందరి శ్రీదేవి మామ్ చిత్రానికి గానూ జాతీయ ఉత్తమనటిగా నిలిచారు. అన్ని విభాగాల్లో 65వ జాతీయ అవార్డులను ఢిల్లీలో ప్రకటించారు. జ్యూరీకి నాయకత్వం వహిస్తున్న దర్శకుడు శేఖర్ కపూర్ ఢిల్లీలోని శాస్త్రిభవన్ లో అవార్డులను ప్రకటించారు. 2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. జ్యూరీ సభ్యులుగా ప్రముఖ నటి గౌతమి, ఇంతియాజ్ హుస్సేన్, గేయ రచయిత మెహబూబ్, పి. శేషాద్రి, అనిరుద్ధారాయ్ చౌదరి, రంజిత్ దాస్, రాజేశ్ మపుస్కర్, త్రిపురారిశర్మ, రూమీ జఫ్రే ఉన్నారు.
బెంగాలీ సినిమా నగర్ కీర్తన్ లో నటించిన రిద్ధీసేన్ జాతీయ ఉత్తమనటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమనటిగా శ్రీదేవి నిలిచారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ, ఉత్తమ హిందీ చిత్రంగా న్యూటన్ జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. బాహుబలి-2 చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ ఎఫెక్ట్స్ కేటగిరీల్లో జాతీయ అవార్డులు సాధించింది. అయితే బాహుబలి -2 సినిమా యాక్షన్ డైరెక్టర్ అబ్బాస్ అలీ మొఘల్ ను యాక్షన్ డైరెక్టర్ గా ప్రకటించడంపై సినిమా నిర్మాత శోభూ యార్లగడ్డ ఆగ్రహం వ్యక్తంచేశారు. అబ్బాస్ అలీ మొఘల్ ఎవరని ప్రశ్నించారు. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలకు ఆయన పనిచేయలేదని చెప్పారు.